ఈమధ్య కొంతమంది ఔత్సాహికుల సారధ్యములో “తెలుగు రచయిత” అన్న ఒక వెబ్సైటు ప్రారంభం అయింది. తెలుగు రచయితల విషయాలు ఒకచోటగా క్రోడీకరించటం చాలా మంచి విషయం, కానీ అంత తేలికైన వ్యవహారం కాదిది.
Image may be NSFW. Clik here to view. ![]() |
ఆదికవి నన్నయ్య Source: http://www.nannayauniversity.info/ |
ముందు తెలుగులో ఎంతమంది రచయితలు ఉన్నారన్నదానికి ఒక లెక్క పత్రం రాయటమే చాలా కష్టం. వీరేశలింగం గారి “ఆంధ్ర కవుల చరిత్రము” మధునాపంతుల వారి “ఆంధ్ర రచయితలు” ఇంకా రచయితల విషయాలు తెలియజేసే అనేకానేక పుస్తకాలను చూడాల్సి వుంటుంది. భారతి లాంటి పాత సంచికల విషయసూచికలను తిరగేస్తే చాలామంది రచయితల పేర్లు బయల్పడతాయి. వారివారి రచనలు వారిపేరున ప్రత్యేకంగా పుస్తకరూపంలోవచ్చిన, వారినే రచయితల కింద గ్రహించాలా లేక అడపాదడపా సంచికలలో వ్యాసాలు అవి రాసినవారినిగూడా రచయితల కింద జమ కట్టాలా అన్నది కూడా ప్రశ్న.
ఈనాడు అంతర్జాలంలో DLI, Press Academy, Internet Archive, Wikipedia, YouTube, Telugu Blogs, మొదలైన చోట్ల అధిక సమాచారం లభిస్తోంది. వీటిల్లో పుస్తకాలు, ఆడియోలు, వీడియోలు, ఫోటోలు విశేషంగా లభిస్తున్నాయి, ఇవన్నీ కూడా పరిగణనలోకి తీసుకోవాలి.
కేవలం ఒక ఫోటో కాకుండా వీలైనన్ని ఎక్కువ ఫోటోలు ఆయా రచయితలవి పెడితే బావుంటుంది. అలాగే వారి రచనల పేర్లు తెలియపరచటంతోబాటుగా వారి రచనల ముఖచిత్రాలు పెడితే కలకాలం ఆ పేర్లు గుర్తుండిపోతాయి. అలాగే వారి చేవ్రాలు, సంతకాలు కూడాను. ఇంతకుముందు ఈ బ్లాగులో పోస్ట్ చేసిన కొంతమంది రచయితల చేవ్రాలు ఈ లింకుద్వారా చూడవచ్చు.
కొంతమంది పేరున్న రచయితల జన్మదిన మరియు ఇతర సంధర్భాలలో ప్రత్యేక సంచికలు, పుస్తకాలు వస్తూవుంటాయి. వాటిల్లో అరుదైన ఫోటోలు, విషయాలు కనబడుతూవుంటాయి. వీటిమీద గూడా దృష్టి సారించాలి.
ఇతర కళాకారులు మంగళంపల్లి, నటరాజ రామకృష్ణ లాంటి వారు కూడా తెలుగులో రచనలు చేసి వున్నారు. వారికి కూడా ప్రాధాన్యం ఇవ్వాలి.
ఇప్పటి తరంవాళ్ళ ఇంటర్వ్యూల వీడియోలు అవి ఎవరన్నా టి.వి.ల వాళ్ళు రికార్డుచేసినవి యూట్యూబ్ లో లభించవచ్చు. కానీ ఇప్పటి, పాతతరంవాళ్ళ ఆడియోలు కావాలంటే మటుకు ఆకాశవాణి వారే శరణ్యం. మళ్ళీ వీటిల్లో రెండు రకాలు, మొదటిది ఒక రచయితను వేరే రచయిత ఇంటర్వ్యూ చేయటం, రెండోది ఒక రచయిత గురించి మరో రచయిత వివరించటం. ఆకాశవాణి వారికన్నా ఆ మాత్రం ముందుచూపు వున్నది కాబట్టి వారు వీలునుబట్టి పేరున్న రచయితలతో ఇంటర్వ్యూలు సలిపి ఆ రికార్డులు వీలున్నంతలో భద్రపరిచి వీలున్నప్పుడు ప్రసారం చేయటం జరుగుతోంది. ఎవరో కొంతమంది ఆకాశవాణి వారి వీరాభిమానులు దూరదృష్టితో, ఆయా ప్రసారాలు రికార్డు చేసి దాచుకోవటం జరిగింది. వారు అభిమానంతో అవి అంతర్జాలంలో పంచుకోవటం జరుగుతోంది, కానీ వాటికి అనేక లింకులు ఏర్పడి అసలు సూత్రధారుడెవరో తెలియకుండా పోతోంది. ఏది ఏమైనా ఈనాడు ఒక రచయిత భౌతికంగా మనమధ్య లేకపోయినా తిరిగి వారి స్వరం వినగలుగుతున్నామంటే ఆ రచయిత కుటుంబసభ్యులకు, అభిమానులకు కలిగే ఆనందం వేరు. ఆ స్వరాలు అన్నీ కూడా ఈ “తెలుగు రచయిత” వెబ్సైట్ లో ప్రతిధ్వనిస్తే ఎవరికైనా ఆనందంగా వుంటుంది.
పుస్తక ప్రదర్శనలలో కొంతమంది కేటలాగులు ఇస్తూవుంటే మనం వాటికి అక్కడే మంగళం పాడేస్తూవుంటాము. ఆ రోజుల్లో వావిళ్ల వారు కేటలాగులు కూడా ప్రచురిస్తూ వుండేవారు. వాటిల్లో కొన్ని వివరాలు దొరికే అవకాశం వుంటుంది.
‘కొత్త ఒక వింత పాత ఒక రోత’ అన్నది ఒక సామెత. కానీ “పాత ఒక రోత” కాదని / కాకూడదని ఈ బ్లాగులో పాత విషయాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వటం జరుగుతోంది. ఈ క్రమంలో అనేక ఫోటోలు, పాటలు, సాహిత్యం, ఆకాశవాణి వారి ప్రసారాల రికార్డులు ఇక్కడ పొందుపరచటం జరుగుతోంది. మొదట అందరిలాగే ఆడియోలన్నీ DivShare వారి వెబ్సైట్లో భద్రపరిస్తే, వారు ఒక శుభముహూర్తంలో మంగళం పాడారు. దాంతో ఆడియోల లింకులు పోయి ప్లేయర్లు శిలావిగ్రహాలుగా మిగిలాయి. ఈ మధ్య ఆ విగ్రహాలు కూడా మాయం అయ్యాయి. మళ్ళీ చచ్చీచెడి కొన్ని 4shared లోనూ కొన్ని Internet Archive లోనూ పెట్టటం జరిగింది.
ఈ క్రమంలో ఈ కింద పేర్కొన్న రచయితల స్వరాలు కొన్ని Internet Archive లో పెట్టటం జరిగింది. ఇవి ఈ లింకులోలభిస్తున్నాయి. ఇవన్నీ ఎప్పుడో ఒకప్పుడు ఎవరికో ఒకరికి ఉపయోగపడకపోతాయాని రికార్డు చెయ్యటం జరిగింది. వీటిని “తెలుగు రచయిత” వెబ్సైట్లో పెట్టుకోటానికి ఎటువంటి అభ్యంతరం లేదు. క్రెడిట్ అంతాకూడా ఆకాశవాణి వారికే చెందుతుంది.
బ్లాగులో “‘సజీవ స్వరాలు’” అన్న శీర్షిక కింద, ఇతర శీర్షికల కింద వినబడే కొంతమంది రచయితల స్వరాలు.
ఆరుద్ర, అద్దేపల్లి రామమోహనరావు, పెనుమర్తి విశ్వనాధ శాస్త్రి (అజంత), బి. ఎన్. శాస్త్రి, బెజవాడ గోపాలరెడ్డి, భద్రిరాజు కృష్ణమూర్తి, బోయి భీమన్న, బూదరాజు రాధాకృష్ణ, బిరుదరాజు రామరాజు, చేకూరి రామారావు, డి. వి. నరసరాజు, దాశరధి కృష్ణమాచార్యులు, దేవులపల్లి రామానుజరావు, దేవులపల్లి కృష్ణశాస్త్రి (1954 నాటి రికార్డు), ఏల్చూరి సుబ్రహ్మణ్యం, జి. కృష్ణ (పాత్రికేయులు), గడియారం రామకృష్ణ శర్మ, గుంటూరు శేషేంద్ర శర్మ, ఇంటూరి వెంకటేశ్వరరావు, జానుమద్ది హనుమత్ శాస్త్రి, జంధ్యాల (దర్శకుడు), కాళోజి నారాయణరావు, కొండవీటి వేంకటకవి, కొప్పవరపు సుబ్బారావు, కొర్రపాటి గంగాధరరావు, మామిడిపూడి వెంకటరంగయ్య, నండూరి రామకృష్ణమాచార్య, నటరాజ రామకృష్ణ, నాయని కృష్ణకుమారి, పోలాప్రగడ సత్యన్నారాయణ మూర్తి, పుట్టపర్తి నారాయణాచార్యులు, రావూరి భరద్వాజ, రాయప్రోలు సుబ్బారావు, రోణంకి అప్పలస్వామి, శ్రీశ్రీ, కాటూరి వెంకటేశ్వరరావు, విశ్వనాధ సత్యన్నారాయణ, సామల సదాశివ, తాపి ధర్మారావు, తిరుమల రామచంద్ర, తురగా జానకీరాణి, వానమామలై వరదాచార్యులు, వాసిరెడ్డి సీతాదేవి, బాలాంత్రపు రజనీకాంతరావు, ప్రయాగ రామకృష్ణ, వేదగిరి రాంబాబు, వి.ఎ.కె. రంగారావు, కె.కె. రంగనాధాచార్యులు మొదలగువారు
మరి వారు అందరి సహకారం కోరుతున్నారు. మరి మన తెలుగు వాళ్ళం అందరం ఏదో ఒక రూపంలో సహకరిస్తేబావుంటుంది.
Tags: Telugu Rachayitha, Telugu Rachayithalu, Andhra Rachayithalu,